||భగవద్గీత ||

|| పదునైదువ అధ్యాయము ||

||పురుషోత్తమ ప్రాప్తి యోగము - శ్లోక తాత్పర్యాలు ||

||ఓమ్ తత్ సత్||


||ఓమ్ తత్ సత్||
శ్రీభగవానువాచ:
ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్|
ఛన్దాంసి యస్యపర్ణాని యస్తం వేద స వేదవిత్ ||1||

"దేనికి వేదములు ఆకులుగాఉన్నవో అట్టి సంసార వృక్షమగు అశ్వత్థవృక్షమును నాశనములేనిదిగనూ, పైన వేళ్ళు గలది గనూ, క్రింద కొమ్మలు గలదిగనూ చెప్పబడుచున్నది. అది ఎవరు తెలిసికొనుచున్నాడో వాడు యథార్థము తెలిసికొనిన వాడు".

శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః
శ్రీమద్భగవద్గీత
పురుషోత్తమ ప్రాప్తి యోగము
పదునైదువ అధ్యాయము

గుణత్రయవిభాగ యోగములో భక్తి ద్వారా త్రిగుణములు దాటవచ్చని, భక్తి ద్వారా బ్రహ్మసాక్షాత్కారము పొందవచ్చని, అనన్యభక్తి చేత ఆ పురుషోత్తముని ఆ పరమాత్మను పొందవచ్చని శ్రీకృష్ణుడు అర్జునునకు చెపుతాడు.

భక్తి ద్వారా త్రిగుణములు దాటవచ్చని చెప్పినా, ఆ భగవద్భక్తి ఉద్భవించడానికి కామక్రోధములతో నిండిన విషయములపై, విరక్తి లేక వైరాగ్యము రావాలి. అంటే సంసార విషయములు క్షణికములు అన్న భావన రావాలి. అది వివరించడముకోసమే ఈ అధ్యాయములో సంసారమును వృక్షముతో పోల్చి దానిని అశ్వత్థ వృక్షమన్నాడు కృష్ణ పరమాత్మ.

అశ్వత్థము అంటే ఏమిటి? అశ్వత్థ అన్నమాట 'శ్వః', 'న స్థః' అన్నమాటలలోనుంచి వచ్చినది.
"శ్వః" అంటే "రేపు" ;
"న స్థః" అంటే "ఉండనిది"
'న స్థః స్వః' అంటే అశ్వత్థః అన్నమాట. అంటే 'రేపు లేనిది'. అదే సంసార వృక్షము. అదే అశ్వత్థ వృక్షము.

సంసార వృక్షమునకు కారణ భూతుడు, మూలము పైనున్న పరమాత్మయే . ఈ వృక్షముయొక్క మూలము పైన వున్న పరమాత్మ యే అధారభూతమగుటచే, ఆ మూలము పైన వున్నట్లు కొమ్మలు క్రింద వున్నట్లు చెప్పబడినది. ఈ సంసారము క్షణికమని తెలిసిననాడే మాయ తొలగి జ్ఞానోదయము అవుతుంది . అదే వేదములసారము . అదే పురుషోత్తమ ప్రాప్తి యోగములో కృష్ణభగవానుని మొదటి మాట .

కృష్ణుడు ఈ సంసార వృక్షముతో ఎందుకు మొదలెట్టాడు అన్న మాటకి శంకరాచార్యులవారి భాష్యము వినతగినది.

శంకరాచార్యులవారు తమ గీతాభాష్యములో పురుషోత్తమ ప్రాప్తియోగము గురించి ముందు మాటగా ఇలా రాస్తారు. రాసినది భగవంతుని ఆలోచనలాగ , "నేను , నా, నాచేత " అన్న మాటలతో రాస్తారు శంకరాచార్యులవారు. ఇక వారి భాష్యం;

"నా అధికారములో వున్న కర్మయోగులకు కర్మఫలము , జ్ఞాన యోగులకు జ్ఞాన ఫలము , అలాగే భక్తియోగముతో నన్ను సేవించు వారికి నా ప్రసాదము వలన ప్రసాదింపబడిన జ్ఞానముతో గుణములను అధిగమించి మోక్షము పొందుతారు. ఇక ఆత్మ తత్త్వము బాగుగా ఎరిగినవారికి చెప్పవలసిన ఏముంది ? అందువలన భగవంతుడు అర్జునినిచేత అడగబడనప్పటికి అత్త్మ తత్త్వము వివరించుటకు , "ఊర్ధ్వమూలం" అనే మాటతో చెప్పడము మొదలు పెడతాడు. అక్కడ వృక్షరూప కల్పనతో సంసార రూపము వర్ణించును. సంసారము నుండి విరక్తి కలిగినవారికే ఆధ్యాత్మిక చింతనలో పోవడానికి అధికారము" అని. అది శంకర భాష్యములో పురుషోత్తమ ప్రాప్తి యోగములో మొదటి మాట.

ఈ భాష్యములో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి కర్మయోగములో వున్నవారికి, జ్ఞానయోగములో ఉన్నవారికి, భక్తి యోగములో, ఇంకాపైగా ఆత్మజ్ఞానము ఉన్నవారికి మోక్షమార్గము తెలిసినదే . వీరందరికి చెప్పవలసినది ఏమీలేదు. రెండవ మాట సంసారబంధములలో ఇరుకున్నవారికి , వాళ్ళు సంసారబంధములనుంచి బయటపడే వారికి వైరాగ్యము రావాలి. అంటే అధ్యాత్మిక చింతన రావడానికి వైరాగ్యము అవసరము. ఆ సంసారులు సంసార స్వరూపము తెలిసికొనినప్పుడే వాళ్ళకి వైరాగ్యము కలుగుతుంది. అప్పుడు వారు ఆధ్యాత్మిక మార్గములో కి వస్తారు. అందుకని అట్టి వారి కోసము భగవంతుడు ఈ అధ్యాయములో సంసార స్వరూపము వివరించడము కోసము అశ్వత్థ వృక్షము తో పోలుస్తాడు.

అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగము సంసార సాగరములో ఉన్నవారికి సంసార స్వరూపము చెప్పి, వారికి సంసారముపై వైరాగ్యము కలగడముకోసము సంసార వృక్షాన్ని ఛేధించి పురుషోత్తమునిపై ఆధ్యాత్మిక చింతన పెరుగునట్లు చెప్పబడిన చెప్పిన యోగము. అ సంసార వృక్షమును ఛేధించి కృష్ణ భగవాను డు చెప్పిన మోక్ష మార్గములో పోవలెను అన్నమాట. కర్మ జ్ఞాన భక్తిమార్గములు ఇందులోనే ఇమిడి వున్నాయి. బహుశ అందుకనే ఈ పదహేనవ అధ్యాయమును చాలామంది గీతలో చిన్న గీత అని కూడా అంటారు.

ఇక మొదటి శ్లోకము.

శ్లోకము 1

శ్రీభగవానువాచ:
ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్|
ఛన్దాంసి యస్యపర్ణాని యస్తం వేద స వేదవిత్ ||1||

స|| యస్య పర్ణాని చన్దాంసి (తత్) అశ్వత్థం ఊర్ధ్వమూలం అథశ్శాఖమ్ అవ్యయం (ఇతి) ప్రాహుః| తత్ యః వేద సః వేదవిత్ (భవతి)||1||

శ్లోకార్థములు

యస్య పర్ణాని - దేని కొమ్మలు
చన్దాంసి - వేదములో
(తత్ ) అశ్వత్థం ఊర్ధ్వమూలం - అట్టి అశ్వత్థ (వృక్షము) పైన మూలము కలది
అథశ్శాఖమ్ - శాఖలు క్రింద కలది
అవ్యయం- నాశనము లేనిది
(ఇతి) ప్రాహుః - అని చెప్పబడుతున్నది.
తత్ యః వేద - అది ఎవరు తెలిసికొనుచున్నాడో
సః వేదవిత్ (భవతి) -అట్టివాడు వేదములను ఎఱింగినవాడు.

||శ్లోక తాత్పర్యము||

"దేని కొమ్మలు వేదములో అట్టి అశ్వత్థ(వృక్ష)ము పైన మూలము కలది
క్రింద శాఖలు కలది, నాశనము లేనిది అని చెప్పబడుతున్నది.
అది ఎవరు తెలిసికొనుచున్నాడో అట్టివాడు వేదములను ఎఱింగినవాడు".||1||

అంటే "ఏ వృక్షమునకు వేదములు ఆకులుగాఉన్నవో అట్టి సంసార వృక్షమగు అశ్వత్థవృక్షమును నాశనములేనిదిగనూ, పైన వేళ్ళు గలది గనూ, క్రింద కొమ్మలు గలదిగనూ చెప్పబడుచున్నది. అది ఎవరు తెలిసికొనుచున్నాడో వాడు యథార్థము తెలిసికొనిన వాడు".

ఇక్కడ విషయ విరక్తి , వైరాగ్యము బోధించడానికి దృశ్యరూపమైన సంసారము ఒక అశ్వత్ధ వృక్షముతో పోల్చబడినది అన్నమాట. ఈ సంసార వృక్షము పైన వ్రేళ్ళు క్రిందకొమ్మలు కలది. పైన వేళ్ళు అంటే ఈ సంసారవృక్షము పైన (ఊర్ధ్వమున) ఉన్న బ్రహ్మమునయుండియే ఆవిర్భవించినది అన్నమాట.

ఈ వృక్షమునకు వేదములే ఆకులు అని ఎందుకు అంటారు. వేదాలు ధర్మము అధర్మముల ఫలములను విడమరిచి చెప్పి సంసారవృక్షమును రక్షిస్తున్నాయి. చెట్టును ఆకులు రక్షించినట్లు వేదాలు సంసార వృక్షాన్ని రక్షిస్తున్నాయి. అందుకనే వేదాలు ఆకులుగా గల సంసార వృక్షము అన్నారు.

వేదాలలో గృహస్తులకు అలాగే మిగిలినవారికి వారు ఫలాపేక్షతో చేయతగిన బంధములు కలిగించు,కర్మకాండ గురించి చాలావుంది. అదే వేదాల చివరిలో, సంసారవృక్షమునుంచి బయట పడడానికి కావలసిన వేదాంతం కూడా చెప్పబడినది. అందుకే వేదాలు సంసారవృక్షాన్ని రక్షిస్తున్నాయి అని అన్నారు.

ఈ విధముగా సంసారవృక్షాన్ని బ్రహ్మమునుంచి ఉద్భవించినదానిగా, వేదములనే ఆకులచే రక్షింపబడిన దానినిగా ఎవరు తెలిసికొంటారో వాళ్ళు వేదము తెలిసినవారు అన్నమాట.

సంసారమును వృక్షముతో పోల్చడము శృతులలోను స్మృతులలోను వస్తుంది. శృతులలో అంటే కథోపనిషత్తులో వస్తుంది. స్మృతులలో అశ్వమేధపర్వము లో వచ్చిన మాట తమ భాష్యములో రాశారు. అశ్వమేధ పర్వము లో బ్రహ్మ వృక్షము యొక్క మూలము అవ్యక్తరూపమైన పరమాత్మ నుంచి ఉద్భవించినది అని. ఆ వృక్షము యొక్క బోదెలు కొమ్మలు ఆకులు చిగుళ్ళు వర్ణన వేదాలు ఇంద్రియములతో పోల్చుతో వర్ణ న చేసి, ఈ మాట చెప్పబడుతుంది. "అదే బ్రహ్మ వనము అదే బ్రహ్మ వృక్షము కూడా"అని.

శ్లోకము 2

అథశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్యశాఖా
గుణప్రవృద్ధా విషయప్రవాలాః|
అధశ్చమూలాన్యనుసన్తతాని
కర్మానుబన్ధీని మనుష్యలోకే||2||

స|| తస్య శాఖాః ( సత్త్వ రజో తమో) గుణప్రవృద్ధాః విషయప్రవాలాః అథః చ ఊర్ధ్వం చ ప్రసృతాః | మనుష్య లోకే కర్మానుబంధీని మూలాని అథః చ అనుసన్తతాని ||2||

||శ్లోకార్థములు||

తస్య శాఖాః - దాని శాఖలు
గుణప్రవృద్ధాః విషయప్రవాలాః - గుణములచే వృద్ధి నొందునవి విషయములు అనబడు చిగుళ్ళు కలవి
అథః చ ఊర్ధ్వం చ - (అవి) పైకిని క్రిందకును వ్యాపించివున్నవి.
మనుష్య లోకే - మనుష్య లోకములో
కర్మానుబంధీని మూలాని - కర్మబంధములు కలుగచేయు దాని మూలములు
అథః చ అనుసన్తతాని - క్రిందకూడా బాగుగా విస్తరించి వున్నాయి.

||శ్లోక తాత్పర్యము||

"దాని శాఖలు గుణములచే వృద్ధి నొందునవి. విషయములు అనబడు చిగుళ్ళు కలవి.
(అవి) పైకిని క్రిందకును వ్యాపించివున్నవి. మనుష్య లోకములో
కర్మబంధములు కలుగచేయు దాని మూలములు క్రిందకూడా బాగుగా విస్తరించి వున్నాయి".||2||

కాని ఈ సంసార వృక్షము నాశరహితమైనది అనాదికాలము నుండి కోట్లకొలది జన్మలనుండి బాగా ధృఢపడుతూవచ్చి శాఖోపశాఖలుగా విస్తరించి యున్నది. దీని శాఖలు సత్వరజోతమో గుణములవలన పైకి ( బ్రహ్మము వేపుకు) కిందకీ ( మనుష్యలోకానికి) వ్యాపించివున్నాయి. అంటే సత్వగుణమువలన పైకి వ్యాపించి వుంటాయి. తమో గుణము వలన కిందకీ వ్యాపించి వున్నాయి అన్నమాట. కర్మవాసనలు కూడా దీని వ్రేళ్ళు. కర్మతో బంధమైన పిల్లవేళ్ళు క్రిందకి మనుష్యలోకములోకి వ్యాపించి వున్నాయి .

శ్లోకము 3

నరూపమస్యేహ తథోపలభ్యతే
నాన్తో నచాదిర్న చ సంప్రతిష్ఠా|
అశ్వత్థమేనం సువిరూఢమూలా
మసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్వా||3||

స|| అస్య రూపం ఇహ న ఉపలభ్యతే | అన్తః న | ఆదిః చ న| సంప్రతిష్ఠా చ న |ఏనం అశ్వత్థం ధృఢేన అసంగ శస్త్రేణ ఛిత్వా ( తత్ బ్రహ్మ పదం మార్గితవ్యం)||3||

||శ్లోకార్థములు||

అస్య రూపం - దాని యొక్క స్వరూపము
ఇహ - ఈ లోకములో
న ఉపలభ్యతే - తెలియబడ కున్నది
అన్తః న - అంతము లేనిది
ఆదిః చ న - మొదలు కూడా లేనిది
సంప్రతిష్ఠా చ న - మధ్యమును కానరాకున్నది
ఏనం అశ్వత్థం - ఈ అశ్వత్థ(వృక్ష)మును
ధృఢేన అసంగ శస్త్రేణ - ధృఢమైన అసంగము అనే శస్త్రముచేత
ఛిత్వా - ఛేధించి
( తత్ బ్రహ్మ పదం మార్గితవ్యం) - (ఆ పర బ్రహ్మము పొందు మార్గము వెదకబదతగినది) ||3||

||శ్లోక తాత్పర్యము||

"దాని యొక్క స్వరూపము ఈ లోకములో తెలియబడ కున్నది.
అంతము లేనిది. మొదలు కూడా లేనిది. మధ్యమును కానరాకున్నది
ఈ అశ్వత్థ(వృక్ష)మును ధృఢమైన అసంగము అనే శస్త్రముచేత ఛేధించి
(ఆ పర బ్రహ్మము పొందు మార్గము వెదకబడ తగినది)". ||3||

సంసార ము యొక్క అసలు స్వరూపము లోకములో అందరికి తెలియదు. అదే మాయ.

మాయ అనగా(అవిద్య). ఎలాగైతే అనిత్యమైనది నిత్యము గాను, దుఃఖమును సుఖముగాను, అనాత్మని ఆత్మ గాను తోపింపజేయునో అలాగే పైనున్న పురుషొత్తముని నుంచి అవిర్భవించిన తలక్రిందులుగానున్న సంసారవృక్షము, పురుషోత్తమునితో సంబంధము లేని వృక్షము వలే కనిపింపచేయును. దీని నిజస్వరూపము అజ్ఞానులకు కానరాకున్నది.

ఈ వృక్షానికి తుది మొదలు తెలిసికోలేము. ఆ రూపముతో కూడా చూడలేము సత్వరజోతమోగుణముల చేత శబ్దాది గుణములచే దీని చిగుళ్ళు వృద్ధి యగుచున్నవి. అట్టి ఈ సంసారవృక్షమునకు ,అంటే ఈ జగత్తుకి ఆధారము బ్రహ్మము అని ఎరిగినవాడే వేదార్ధమును యదార్థమును నెరిగినవాడు. ఆ యదార్థము తెలిసికొనినవాడు ప్రాపంచికి విషయములనుండి విడివడి అంటే అసంగుడై బ్రహ్మమార్గమున పోవాలి అని ఇక్కడ చెప్పడమైనది.

ఇక్కడ అసంగము అంటే ప్రాపంచిక విషయవిరక్తి అభిమానము లేకుండుట. అసంగమనే బలమైన ఖడ్గముచేత సంసారవృక్షమును చేదించవలెను అని. అంటే మంద వైరాగ్యముచే ఈ సంసారవృక్షము ఛేదింపబడదు. తీవ్రవిరక్తికి పరిపూర్ణ అసంగము ఆవశ్యకమై యున్నది.(15.3)

ఇక్కడ సంసారులకు భగవంతుని ఉపదేశము ఒకటే. బ్రహ్మమార్గమున నున్నవారికి, ఈ సంసారవృక్షము, మాయ ద్వారా అవరోధము కల్పించుచున్నది. దీనిని ఛేదించి ముందుకు పోవాలి అని .

ఆ సంసార వృక్షము ఛేదించి తరువాత ఏమి చెయ్యలి అన్నది మళ్ళీ కృష్ణుడే చెపుతాడు నాలుగొవ శ్లోకములో.

శ్లోకము 4

తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్ గతా ననివర్తన్తి భూయః|
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ||4||

స|| తతః యస్మిన్ గతాః భూయః న నివర్తన్తి యతః పురాణీ ప్తవృత్తిః ప్రసృతా తం ఆద్యం పురుషం ఏవ చ ప్రపద్యే | ఇతి( మత్వా) తత్ ( బ్రహ్మ ) పదం మార్గితవ్యమ్||

||శ్లోకార్థములు||
తతః యస్మిన్ గతాః - పిమ్మట ఎక్కడికి వెళ్ళినవారు
భూయః న నివర్తన్తి - మళ్ళీ తిరిగిరారో
యతః పురాణీ ప్తవృత్తిః - ఎక్కడనుంచి పురాతనమైన ప్రవృత్తి
ప్రసృతా- వ్యాపించెనో
తం ఆద్యం - ఆ ఆదిపురుషుడగు
పురుషం ఏవ చ - ఆ పరమాత్మనే
ప్రపద్యే- శరణు వేరెడెదను.
ఇతి( మత్వా) తత్ - అని తలచి
తత్ పదం మార్గితవ్యమ్- ఆ మార్గము వెదకతగినది

||శ్లోకతాత్పర్యము||

" పిమ్మట ఎక్కడికి వెళ్ళినవారు మళ్ళీ తిరిగిరారో, ఎక్కడనుంచి పురాతనమైన ప్రవృత్తి వ్యాపించెనో,
ఆ ఆదిపురుషుడగు ఆ పరమాత్మనే శరణు వేరెడెదను అని తలచి ఆ మార్గము వెదకతగినది".||4||

ముందు శ్లోకములో "అసఙ్గ శస్త్రేణ దృఢేన ఛిత్వా" అసంగమనే ఖడ్గముతో ఆ సంసారవృక్షమును ఛేదించి అని చెప్పి, ఇక్కడ, "తతః తత్ పదం మార్గితవ్యం", అంటే పిమ్మట ఆ ప్రబ్రహ్మము యొక్క స్థానమునకు ( పదం) మార్గము వెదకవలెను అని చెప్పుతాడు.

ఆ "పదం" ఏమిటి?. అదే పరబ్రహ్మపదం. అదే "యతో వాచా నివర్తన్తే | అప్రాప్యమనసా సహ"; "ఎక్కడికెళ్ళి మనస్సు వాక్కు ఏమీ పొందక తిరిగివచ్చాయి ", అనే వాక్యాలతో విశదీకరింపబడిన పదము. మనస్సు వాక్కుల వర్ణనకి అందకపోయినా, ఆ పదము చేరిన వారు మళ్ళీ వెనక్కి రారు ."ననివర్తన్తి భూయః". అక్కడనుంచే సమస్త ప్రకృతి వ్యాపించెను. ఆ మార్గము శరణాగతుని లాగా వెదకాలి? ఈ శ్లోకములో చెపుతున్నదు - అట్టి ప్రకృతికి కారణభూతుడైన ఆ ఆదిపురుషునే శరణు వేడె దను అనే భావముతో ఆ పరబ్రహ్మము చేరే మార్గము వెదకవలెను అన్నమాట.

ఇది ఎవరికి సాధ్యము? అందరికీ సాధ్యమా ? అది ఐదవ శ్లోకములో.

||శ్లోకము 5 ||

నిర్మానమోహా జితసఙ్గదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః|
ద్వన్ద్వైర్విముక్తా సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛన్త్య మూఢాః పదమవ్యయం తత్ ||5||

స|| నిర్మానమోహాః జితసంగ దోషాః అధ్యాత్మ నిత్యాః వినివృత్త కామాః సుఖదుఃఖ సంజ్ఞైః ద్వంద్వైః విముక్తాః అమూఢాః తత్ అవ్యయమ్ పదం గచ్ఛన్తి||

||శ్లోకార్థములు||

నిర్మానమోహాః - అహంకారము అవివేకము లేనివారును
జితసంగ దోషాః- సంగము అనబడు దోషమును జయించినవారును
అధ్యాత్మ నిత్యాః - నిరంతరము ఆత్మజ్ఞానము కలవారు
వినివృత్త కామాః- కోరికలన్నియు లెస్సగా తొలగినవారును,
సుఖదుఃఖ సంజ్ఞైః- సుఖదుఃఖములనబడు
ద్వంద్వైః విముక్తాః - ద్వంద్వములనుండి విడువబడినవాడును
అ మూఢాః - మూఢులు కానివారు
తత్ అవ్యయమ్ పదం గచ్ఛన్తి- ఆ వాసనరహితమైన స్థానమును పొందుచున్నారు. ||

||శ్లోకతాత్పర్యము||
"అహంకారము అవివేకము లేనివారును, సంగము అనబడు దోషమును జయించినవారును , నిరంతరము ఆత్మజ్ఞానము కలవారు, కోరికలన్నియు లెస్సగా తొలగినవారును, సుఖదుఃఖములనబడు ద్వంద్వములనుండి విడువబడినవారును
మూఢులు కానివారు, ఆ నాశన రహితమైన స్థానమును పొందుచున్నారు".||5||

ఇక్కడ ఎవరు ఆ పరబ్రహ్మ స్థానము పొందగలరో వారి గుణములు చెప్పబడ్డాయి.

పదమూడవ అధ్యాయములో, "అమానిత్వం అడమ్బిత్వం అహింసా క్షాన్తిరార్జవమ్"(13.7) అంటూ క్షేత్రజ్ఞుని లక్షణములు చెప్పబడినవి. ఆ లక్షణములు కలవాడు జ్ఞేయమును అంటే తెలిసికొన తగినది అయిన బ్రహ్మమును, తెలిసికొనగలడు అని చెప్పబడినది. పరబ్రహ్మమును తెలిసికొనగలడు అంటే నాశనము లేని బ్రహ్మ స్థానము చేరగలడు అని. ఇక్కడ కూడా అదే మాట చెప్పబడినది. ఇక్కడ పర బ్రహ్మపదము వెదకగలిగినవాని గుణములు చెప్పి, ఆ గుణములు కలవారు , ఆ నాశన రహితమైన స్థానమును పొందుచున్నారు అని చెప్పబడినది".||5||

ఇక ఆ పరబ్రహ్మ స్థానము యొక్క ప్రత్యేకత చెపుతాడు.
||శ్లోకము 6||

నతత్ భాసయతే సూర్యో న శశాజ్ఞ్కో న పావకః|
యద్గత్వా ననివర్తన్తే తద్ధామ పరమం మమ ||6||

స|| తత్ ( స్థానమ్) సూర్యః న భాసయతే | శశాంకః ( న భాసయతే)| పావకః (అపి) న ( భాసయతే)| యత్ గత్వా న నివర్తన్తే తత్ మమ పరమం ధామమ్||

||శ్లోకార్థములు ||

తత్ ( స్థానమ్) - దానిని ( ఆ పరమాత్మ స్థానమును)
సూర్యః న భాసయతే - సూర్యుడు ప్రకాశింప చేయ జాలడు
శశాంకః ( న భాసయతే)- చంద్రుడు ప్రకాశింప చేయ జాలడు
పావకః (అపి) న ( భాసయతే) - అగ్ని కూడా ప్రకాశింప చేయ జాలడు
యత్ గత్వా న నివర్తన్తే - ఎక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగిరారో
తత్ మమ పరమం ధామమ్ - అది నా శ్రేష్ఠమైన స్థానము

|| శ్లోకతాత్పర్యములు||

"దానిని ( ఆ పరమాత్మ స్థానమును), సూర్యుడు ప్రకాశింప చేయ జాలడు. చంద్రుడు ప్రకాశింప చేయ జాలడు.
అగ్ని కూడా ప్రకాశింప చేయ జాలడు. ఎక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగిరారో అది నా శ్రేష్ఠమైన స్థానము."||6||

ఆ పరమాత్మస్థానము సూర్యచంద్రాగ్నులు అలాగే అగ్ని కూడా ప్రకాశింపచేయజాలవు . అట్టి స్థానమును పొందిన వారు మరల ఈ సంసార సాగరానికి మళ్ళీ రారు. (15.6)

పరబ్రహ్మ పదమును విశ్లేషిస్తూ చెప్పిన మాటలు ఇవి. ఇదే ఉపనిషత్తులలో కూడా చెప్పబడిన మాట కూడా. కథోపనిషత్తులో "న తత్ర సూర్యో భాతి నచన్ద్ర తారకమ్" అని చెప్పబడినది. అంటే "అక్కడ సూర్యుడు ప్రకాశించడు; చంద్రుడు నక్షత్రాలు కూడా ప్రకాశించవు" అని. అది ఈ శ్లోకములో చెప్పబడిన మాటే. ఇంకా, " తస్య భాసా సర్వమిదం విభాతి", అంటే "సమస్తము దాని ప్రకాశము చేతనే ప్రకాశిస్తున్నాయి" అని కూడా కథోపనిషత్తులో చెప్పబడినది. ఈ మాట కూడా పన్నెండవ శ్లోకములో వస్తుంది.

ఆ స్థానము చేరినవారికి మళ్ళీ పునర్జన్మ వుండదు. అదే అక్కడికి వె ళ్ళినవారు మళ్ళీ తిరిగిరారు అని చెప్పి, కృష్ణుడు ఆ స్థానము, తన "శ్రేష్ఠమైన స్థానము అని చెపుతున్నాడు. అంటే తనే పరమాత్మ అని సందేహము లేకుండా చెప్పుచున్నాడు.

అ పరమాత్మ స్థానము పొందు జీవుల స్వరూపము ఏమిటి? అది ముందు శ్లోకములో.

||శ్లోకము 7||

మమైవాంశో జీవలోకే జీవభూతస్సనాతనః|
మనష్షష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||7||

స|| మమ ఏవ సనాతనః అంశః జీవలోకే జీవ భూతః ప్రకృతిస్థాని మనః షష్ఠాని ఇన్ద్రియాణి కర్షతి||

||శ్లోకార్థములు ||

మమ ఏవ సనాతనః అంశః - నా యొక్కయే అనాది యగు అంశము.
జీవలోకే- జీవ లోకములో
జీవ భూతః - జీవుడై
ప్రకృతిస్థాని - ప్రకృతియందు వున్న
మనః షష్ఠాని ఇన్ద్రియాణి - మనస్సు ఆరవదిగా కలిగిన ఇంద్రియములను
కర్షతి - ఆకర్షించుచున్నది

|| శ్లోకతాత్పర్యములు||

"నా యొక్కయే అనాది యగు అంశము జీవ లోకములో జీవుడై,
ప్రకృతియందు వున్న, మనస్సు ఆరవదిగా కలిగిన ఇంద్రియములను,ఆకర్షించుచున్నది".||7||

'మమైవాంశో' అన్న మాటతో భగవంతుని అంశ జీవుని లో ఉంది అని నిస్సందేహముగా చెపుతున్నాడు. అంటే జీవాత్మ పరమాత్మా ఒకటే అన్నమాట. జీవాత్మ కి ఆత్మ అనుభూతి అయినపుడు జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుస్తుంది. అత్మానుభూతి కానంతకాలము జీవుడు అజ్ఞానములోనే ఉంటాడు. ఆ జీవుడే అక్షరుడు అంటే నాశనము లేని వాడు అని చెప్పినప్పుడు, అంటే మనకు తెలియవలసిన మాట, - జీవుడు ఈ శరీరము వదిలినా ఇంకో శరీరము పట్టుకొని జన్మ జన్మలకి జీవించేవాడు అని. ఇది కూడా మనము విన్నమాటే.

ఇక్కడ అదే భావముతో కృష్ణుడు అర్జునుడికి మళ్ళీ బోధిస్తున్నాడు.

జీవుడు వాస్తవముగా భగవదంశస్వరూపుడు. తాను శరీరమని తలచి ఇంద్రియములతో మనస్సుతో కాలక్షేపము చేయుచున్నాడు. వాయువు సుగంధవస్తువులు గానీ దుర్గంధవస్తువులుగాని ఎలా తీసుకొనిపోవునో అలాగనే జీవుడు పాత శరీరమువీడి క్రొత్త శరీరముధరించినపుడు మనస్సును ఇంద్రియములను వాటియందుండు సంస్కారములను( వాసనలు) తీసుకొని పోవుచున్నాడు. జీవుడు చెవి ముక్కు కన్ను చర్మము అనే జ్ఞానేంద్రియములతో మనస్సు ఆశ్రయించి, విషయములను అనుభవించు చున్నాడు. ఆత్మ అనాత్మవివేకము ఉన్నవారు, చిత్త శుద్ధికలిగి ధ్యానాది ప్రయత్నము చేసినవారుమాత్రమే పరమాత్మను తెలిసికొనగలరు. ఇదే మనము ఇక్కడ మూడు శ్లోకాలలో .(15.7,8,9) వింటాము

||శ్లోకము 8 ||

శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః|
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయత్||8||

స|| ఈశ్వరః యత్ చ(యదా) అపి ( శరీరం) ఉత్క్రామతి యత్ శరీరం అవాప్నోతి (తదా) ( యథా) వాయుః ఆశయాత్ గన్ధాన్ సంయాతి

||శ్లోకార్థములు ||

ఈశ్వరః- దేహములోని ఈశ్వరుడు
యత్ చ అపి - ఎప్పుడైతే
ఉత్క్రామతి - శరీరమునుంచి బయలుదేరుచున్నాడో
యత్ శరీరం అవాప్నోతి - ఎప్పుడు శరీరము పొందుచున్నాడో , ( అప్పుడు)
( యథా) వాయుః ఆశయాత్ గన్ధాన్ సంయాతి- ఏవిధముగా వాయువు వాటి స్థానములనుంచి గంధములను తీసుకుపోవునో
తథైవ ఏతాని ( షష్టాని ఇన్ద్రియాణి) గృహీత్వా సంయాతి) అదేవిధముగా ఈ ఆరు ఇందియములు తీసుకొని పోవును ||

|| శ్లోకతాత్పర్యములు||

"దేహములోని ఈశ్వరుడుఎప్పుడైతే శరీరమునుంచి బయలుదేరుచున్నాడో, ఎప్పుడు దేహము పొందుచున్నాడో అప్పుడు, ఏవిధముగా వాయువు వాటి స్థానములనుంచి గంధములను తీసుకుపోవునో అదేవిధముగా ఈ ఆరు ఇంద్రియములు తీసుకొని పోవును".||8||

జీవుడు ఈ విధముగా పునర్జన్మ ఉన్నంతకాలము తన వాసనలతోపాటు దేహ యాత్ర సాగిస్తూ వుంటాడు.

||శ్లోకము 9 ||

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే||9||

స|| అయం ( జీవః) శ్రోత్రమ్ చక్షుః స్పర్శనం చ రశనం ఘ్రాణం ఏవ చ మనః చ అధిష్ఠాయ విషయాన్ ఉపసేవతే||

||శ్లోకార్థములు ||
అయం ( జీవః) - ఈ జీవాత్మ
శ్రోత్రమ్ చక్షుః స్పర్శనం చ - చెవిని కంటిని చర్మమును
రశనం ఘ్రాణం ఏవ చ - నాలుకను ముక్కును కూడా
మనః చ- మనస్సును కూడా
అధిష్ఠాయ- ఆశ్రయించి
విషయాన్ ఉపసేవతే- విషయభోగములను అనుభవించుచున్నాడు.

|| శ్లోకతాత్పర్యములు||

"ఈ జీవాత్మ చెవిని కంటిని చర్మమును నాలుకను ముక్కును అలాగే మనస్సును కూడాఆశ్రయించి
విషయభోగములను అనుభవించుచున్నాడు".||9||

||శ్లోకము 10 ||

ఉత్క్రామన్తం స్థితం వాఽపి భుఞ్జానం వా గుణాన్వితమ్ |
విమూఢానానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః||10||

స|| ఉత్క్రామన్తం వా స్థితం వా భుఞ్జానం గుణాన్వితాన్ అపి విమూఢాః న అనుపశ్యన్తి | జ్ఞాన చక్షుఃషః పశ్యన్తి ||

||శ్లోకార్థములు||

ఉత్క్రామన్తం - బయలుదేరుచున్నవాడును ( ఒక శరీరమునుండి ఇంకొక శరీరమునకు)
స్థితం వాఽపి - లేక ఒకే శరీరములో ఉన్నవాడును
భుఞ్జానం వా - లేక (ఈ విషయములను) అనుభవించువాడును
గుణాన్వితాన్ అపి - గుణములతో కూడినవాడును అగు
ఏనమ్ - ఈ జీవాత్మను
విమూఢాః న అనుపశ్యన్తి - మూఢులు చూడ లేకున్నారు
జ్ఞాన చక్షుషః పశ్యన్తి - జ్ఞాన దృష్ఠి కలవారు చూచుచున్నారు.

|| శ్లోకతాత్పర్యములు||

"బయలుదేరుచున్నవాడును ( ఒక శరీరమునుండి ఇంకొక శరీరమునకు), లేక ఒకే శరీరములో ఉన్నవాడును, లేక ఈ విషయములను అనుభవించువాడును గుణములతో కూడినవాడును అగు ఈ జీవాత్మను, మూఢులు చూడ లేకున్నారు, జ్ఞాన దృష్ఠి కలవారు చూచుచున్నారు" .||10||

జ్ఞాన దృష్ఠి కలవారు అంటే వివేకము విచక్షణా జ్ఞానము కలవారు అని. అంటే జీవాత్మ దేహము వేరు వేరు అని గ్రహించకలగడము.

||శ్లోకము 11 ||

యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్|
యతన్తోఽప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః||11||

స|| యతన్తః యోగినః ఆత్మని అవస్థితమ్ ఏనం (ఆత్మన్) పశ్యన్తి| యతన్తః అపి అకృతాత్మనః అచేతసః ఏనం ( ఆత్మన్) న పశ్యన్తి||

||శ్లోకార్థములు||
యతన్తః యోగినః - ప్రయత్నము చేయుచున్న యోగులు
ఆత్మని అవస్థితమ్ ఏనం - తమ యందుఉన్నట్టి ఈ ( ఆత్మను)
పశ్యన్తి - చూచుచున్నారు.
యతన్తః అపి - ప్రయత్నము చేయుచున్ననూ
అకృతాత్మనః అచేతసః - కృతార్థులుకానివారు అవివేకులు
ఏనం ( ఆత్మన్) న పశ్యన్తి- ఈ ఆత్మను చూడలేకున్నారు.

|| శ్లోకతాత్పర్యములు||

"ప్రయత్నము చేయుచున్న యోగులు తమ యందుఉన్నట్టి ఈ ( ఆత్మను) చూచుచున్నారు.
ప్రయత్నము చేయుచున్ననూ కృతార్థులుకానివారు అవివేకులు ఈ ఆత్మను చూడలేకున్నారు".||11||

ఇక్కడ ప్రయత్నము చేయుచున్నయోగులు, అంటే చిత్తశుద్ధితో ప్రయత్నము చేయు చున్న యోగులు అని. అట్టి యోగులు ఆత్మను చూచుచున్నారు అని. మరి ఎలాంటి యోగులు ఇది చూడలేకపోతున్నారు? దాని సమాధానము కృతార్థులు కాని వారు, అవివేకులు ఆత్మని చూడలేకపోతున్నారు అని. శంకరాచార్యులవారు తమ భజగోవిందం లో ఇదే మాట - "పశ్శ్యన్నపి చ న పశ్యతి మూఢో" , అంటే మూఢుడికి ఆత్మ చూస్తున్నాకాని కనపడదు అని చెపుతారు.

ఇక్కడ ముఖ్యమైన మాట చిత్తశుద్ధితో ప్రయత్నము చేస్తే ఆత్మ సాక్షాత్కారము అవుతుంది అని.

శంకరాచార్యులవారి భజగోవిందమ్ శ్లోకము మననం చేసుకోడానికి బాగుంటుంది

జటిలో ముండీ లుంచిత కేశః
కాషాయామ్బర బహుకృత వేషః
పశ్శ్యన్నపి చ న పశ్యతి మూఢో
ఉదర నిమిత్తం బహుకృత వేషః|| భజ||

||శ్లోకము 12 ||

యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్|
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ||12||

స|| ఆదిత్యగతం యత్ తేజః అఖిలం జగత్ భాసయతే , (తథైవ) చంద్రమసి యత్ (తేజః అస్తి) అగ్నౌచ యత్ ( తేజః అసి) తత్ తేజః మామకమ్ విద్ధి||

||శ్లోకార్థములు||
ఆదిత్యగతం- సూర్యునియందు గల
యత్ తేజః - ఏ తేజము
అఖిలం జగత్ భాసయతే - సమస్త జగత్తును ఎట్లు ప్రకాశింపచేయునో
చంద్రమసి యత్ - చంద్రునియందు ఎట్టి తేజస్సు కలదో
అగ్నౌచ యత్ - అగ్ని యందు ఎట్టి తేజస్సు కలదో
తత్ తేజః మామకమ్ విద్ధి - ఆ తేజస్సు నా వలన కలిగినదే.

|| శ్లోక తాత్పర్యములు||

"సూర్యునియందు గల తేజస్సు సమస్త జగత్తును ఎట్లు ప్రకాశింపచేయునో , చంద్రునియందు ఎట్టి తేజస్సు కలదో, అగ్ని యందు ఎట్టి తేజస్సు కలదో, ఆ తేజస్సునా వలన కలిగినదే అని తెలిసికొనుము".||12||

సూర్య చంద్రుల అగ్ని యొక్క తేజస్సు , "నావలన కలిగినదే" అంటాడు కృష్ణుడు. విభూతి యోగములో తన విభూతలకు అంతము లేదు, అని కొన్ని వివరించి చివరిలో , "యద్యత్ విభూతిమత్ సర్వం... మమతేజోంశ సంభవమ్" అని అంటే ఈ ప్రపంచములో ఐశ్వర్యయుక్తమైనది తేజోవంతమైనది ఏది వున్నా అది నాతేజస్సులో ని అంశము ద్వారా కలిగినదే అని తెలిసికొనుము అంటాడు. ఇక్కడ ఇప్పుడు చెపుతున్నమాట అదే.

||శ్లోకము 13 ||

గామావిశ్య చ భూతాని ధారమ్యహ మోజసా|
పుష్ణామి చౌషధీస్సర్వా స్సోమో భూత్వా రసాత్మకః||13||

స|| చ అహం గామ్ ఆవిశ్య ఓజసా భూతాని ధారయామి | రసాత్మకః సోమః భూత్వా సర్వాః ఓషధీః పుష్ణామి||

||శ్లోకార్థములు||
చ అహం - మరియు నేను
గామ్ ఆవిశ్య - భూమిని ప్రవేశించి
ఓజసా భూతాని ధారయామి - నా బలము చేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను.
రసాత్మకః సోమః భూత్వా - రసస్వరూపుడగు చంద్రుడను అయి
సర్వాః ఓషధీః పుష్ణామి- సమస్త ఔషధులను పోషించుచున్నాను.

|| శ్లోకతాత్పర్యములు||

"మరియు నేను భూమిని ప్రవేశించి నా బలము చేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను.
రసస్వరూపుడగు చంద్రుడను అయి సమస్త ఔషధులను పోషించుచున్నాను".||13||

ఇక్కడ "ఓజసా భూతాని ధారయామి" అంటే తన బలము చేత సమస్త భూతములను ధరించుచున్నాను అని. ఇదేమాట శృతిలో ( ఋగ్వేదములో 10.121.1) 'స దధార పృథివీం' - అని చెప్పబడినది. ప్రాణి కోట్లకి శక్తి, సామర్థ్యము, బలము ఇచ్చేది భగవంతుడే అని.

అయితే మనము కర్మ సన్న్యాస యోగములో "న కర్తృత్వం న కర్మాణి సృజతి ప్రభుః" అని, "నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః" అని విన్నాము. అంటే ప్రభువు మనకి పభువు మన కర్మలని కర్తృత్వము గాని పుణ్యపాపాలు కాని ఇవ్వడు. ఆ భగవంతుడే కేవలము సాక్షి రూపమే అని విన్నాము. ఈ అధ్యాయములో మనకి అన్నీ ఇచ్చేది భగవంతుడే అని వింటున్నాము. దీని భావము ఏమిటి అని అనిపించవచ్చు. భగవద్గీతలో ముఖ్యముగా మూడు మార్గములు ప్రతిపాదించబడ్డాయి. అవి జ్ఞాన యోగము, కర్మ యోగము, భక్తి యోగము. ఈ మూడు మార్గముల వెనక నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము , సగుణ పరబ్రహ్మ స్వరూపము కూడా వున్నాయి. కృష్ణ భగవానుడే ఈ మూడు మార్గములు చెపుతున్నాడు కూడా. ఈ అధ్యాయములో చెప్పబడుతున్నది, సగుణ పరబ్రహ్మరూపము, అంటే కృష్ణ భగవానుని విభూతుల మీద అని గ్రహించవలెను. ఇది కృష్ణ పరమాత్మ సంసారులకు సంసార స్వరూపము యొక్క కీలకము చెపుతూ, వారికి పురుషోత్తమ ప్రాప్తి అవడానికి చెపుతున్న ఉపదేశము.

||శ్లోకము 14 ||

అహం వైశ్వానరోభూత్వా ప్రాణినామ్ దేహమాశ్రితః|
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్||14||

స|| అహం వైశ్వానరః భూత్వా ప్రాణినామ్ దేహం ఆశ్రితః ప్రాణాపానసమాయుక్తః చతుర్విధం అన్నం పచామి ||

||శ్లోకార్థములు||

అహం వైశ్వానరః భూత్వా - నేను వైశ్వానరుడను అయి
ప్రాణినామ్ దేహం ఆశ్రితః - ప్రాణులయొక్క దేహమును ఆశ్రయించిన వాడనై
ప్రాణాపానసమాయుక్తః- ప్రాణ అపాన వాయువులతో కూడుకొని
చతుర్విధం అన్నం పచామి - నాలుగు విధములగు అన్నమును పక్వము చేయుచున్నాను.

|| శ్లోకతాత్పర్యములు||

" నేను వైశ్వానరుడను అయి ప్రాణులయొక్క దేహమును ఆశ్రయించిన వాడనై,
ప్రాణ అపాన వాయువులతో కూడుకొని నాలుగు విధములగు అన్నమును పక్వము చేయుచున్నాను".||14||,

అంటే "నేను వైశ్వానరుడను జఠరాగ్ని అయి ప్రాణులయొక్క శరీరము ఆశ్రయించి ప్రాణ అపాన వాయువులతో కూడుకొని నాలుగు విథములగు అన్నమును పచనము చేయుచున్నాను"అని.

వైశ్వానరుడు అంటే జఠరాగ్ని అని శృతులలో ( బృహదారణ్యక ఉపనిషత్ 5.9.1)లో చెప్పబడినది. "అయమగ్నివైశ్వానరో యోఽయమన్తః పురుషే ఏనేదం అన్నమ్ పచ్యతే" అంటే ఈ అగ్ని వైశ్వానరుడు. ఇది పురుషుని లోపల వుండి, అన్నమును పచనము చేయును అని. ఇది శ్రుతులలో వచ్చిన మాట. ఇదే కృష్ణుడు తన మాటలలో చెపుతున్నాడు. "అహం వైశ్వానరః" అంటే తనే వైశ్వానరుడు అని. వైశ్వానరుడు అంటే జఠరాగ్ని అని శ్తులలో చెప్పబడిన మాట.

మనము భుజించు ఆహారమును పరమాత్మయే ఒసంగుచున్నాడు అని ముందు శ్లోకములో విన్నాము. ఆ అన్నమును తానే పచనము చేయుచున్నాడు/చేయించుచున్నాడు అని ఈ శ్లోకములో వింటున్నాము. వైశ్వానరుడు అంటే జఠరాగ్నిగా అయి, ప్రాణులయొక్క శరీరములో ప్రాణవాయువు సహాయముతో నాలుగు విధములగు అన్నమును పచనము చేయుచున్నాడు.

అ నాలుగు విథములగు అన్నములు- భోజ్యమ్ భక్ష్యం, లేహ్యం, చోష్యమ్.
భక్ష్యము - కొరుక్కొని తినేది
భోజ్యము - చప్పళించి తినే మెత్తనైన అన్నము
లేహ్యము - నాలుకతో రుచి చూచే పచ్చళ్ళు
చోష్యము - పాయసము మొదలగునవి.

"పచామ్యన్నం చతుర్విథం" అన్న కృష్ణ భగవానుని మాటతో మనకు తెలిసేది, పచనముకూడా భగవదనుగ్రహము అయినప్పుడు మనము తినేది భగవంతునికి అర్పించి మరీ తినవలెను అని. మనకు ఎవరైనా సహాయకులు ఉంటే వారికి మనదగ్గర ఉన్నపనులన్నీ అప్పగించము. అప్పగించ తగిన పనులే అప్పగిస్తాము. అలాగే పచనము అంతా భగవంతుని భాద్యత కాబట్టి అమితముగా భోజనము చేయకూడదు. మితముగా చేయవలెను. అంటే తినడముకూడా తగినట్లు మితముగా తినవలెను. తిను ఆహారముకూడా న్యాయార్జితమై ఉండాలి.

భగవంతుడు మన జఠరములోనే కాదు హృదయములో కూడా నివసిస్తాడు. అదే పదహేనవ శ్లోకములో:

||శ్లోకము 15 ||

సర్వస్య చాహం హృధి సన్నివిష్టో
మత్తః స్మృతిః జ్ఞానమపోహనం చ|
వైదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్||15||

స|| అహం సర్వస్య చ హృది సన్నివిష్ఠః | మత్తః స్మృతిః జ్ఞానం ఆపోహనం చ (భవన్తి)| సర్వైః వేదైః చ అహం ఏవ వేద్యః| అహం ఏవ వేదాన్తకృత్| అహం ఏవ వేదవిత్ చ|

||శ్లోకార్థములు||

అహం సర్వస్య చ హృది సన్నివిష్ఠః- నేను సమస్త ప్రాణులయొక్క హృదయమందు ఉన్నవాడను.
మత్తః స్మృతిః జ్ఞానం ఆపోహనం చ (భవన్తి)- నావలన జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కూడా కలుగుచున్నవి.
సర్వైః వేదైః - సమస్త వేదములలో
అహం ఏవ వేద్యః- నేనే తెలిసికొనతగిన వాడను.
అహం ఏవ వేదవిత్ చ|- నేనే వేదము ఎఱిగినవాడను కూడా.

|| శ్లోకతాత్పర్యములు||
"నేను సమస్త ప్రాణులయొక్క హృదయమందు ఉన్నవాడను.
నావలన జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కూడా కలుగుచున్నవి.
సమస్త వేదములలో నేనే తెలిసికొనతగిన వాడను. నేనే వేదము ఎఱిగినవాడను కూడా".||15||

"వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యో" అన్న మాట, అధ్యాత్మిక వేదాంత చర్చలలో తరచు వినబడే మాట. వినిపించబడే మాట. వేదముల ద్వారా తెలిసికొనబడినది, జ్ఞేయము. ఆ జ్ఞేయమే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము, కృష్ణభగవానుడు నేనే అని ఉద్ఘాటిస్తున్నాడు. ఆ పరబ్రహ్మము ఎంతో దూరములో లేదు. అత్యంత సమీపములో, ప్రతి ఒక్కడి హృదయములో వున్నాడు ( వున్నది). జీవుడి జ్ఞాపక శక్తి,, జ్ఞానము, మతిమరుపు కూడా, "నా వలననే " అంటే పరబ్రహ్మము వలననే కలుగు చున్నవి.

'అన్ని వేదములచే తెలిసికొనతగిన వాడను నేను', అన్న మాటతో కృష్ణభగవానుడు వేదాంత సారమంతా బోధిస్తున్నాడన్నమాట. వేదాలలో చాలా చెప్పబడ్డాయి. కాని వేదాలలో తెలిసికోనబడ తగినది పరమాత్మయే. పరమాత్మయే ఆత్మస్వరూపము. ఈ మాట రెండవ అధ్యాయమునుంచి అనేకవిధములుగా చెప్పబడుతూనే ఉంది. వేదములలో తెలిసికొనతగిన వాడిని నేనే అని ఇక్కడ చెప్పడము ఇప్పటిదాకా చెప్పినది ధృవీకరణము చేయడమే

శంకరాచార్యులవారు తమ భాష్యములో "యదాదిత్య గతం తేజః" అన్న శ్లోకమునుంచి మూడు శ్లోకాలలో ," భగవతః ఈశ్వరస్య నారాయణాఖ్యస్య విభూతి సంక్షేపః ఉక్తః" అంటే వాసుదేవుని విభూతులు సంక్షేపముగా చెప్పబడినాయి. అంటే ఇవన్నీ సగుణ బ్రహ్మ విభూతులు అని.

ఇక్కడ చెప్పబడినది జ్ఞానమార్గములో పయనించే వారికి అనుగుణమైన మాటలు కావు. జ్ఞానమార్గము కూడా ముఖ్యము అయిన మార్గమే. అందుకని నిరాకార పరబ్రహ్మమును ఉద్దేశించి మూడు శ్లోకాలు కృష్ణ భగవానుడు చెపుతాడు. ఈ మూడు శ్లోకాలలో క్షర అక్షర పురుషులగురించి చెప్పి, ఉత్తమపురుషుడు క్షర అక్షర పురుషులకు మించినవాడు అని చెప్పి , మళ్ళీ ఆ ఉత్తమపురుషుడు, పురుషోత్తముడు తనే అని చెపుతాడు.

||శ్లోకము 16 ||

ద్వావిమౌ పురుషోలోకే క్షరశ్చాక్షర ఏవచ |
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే||16||

స|| లోకే క్షరః చ అక్షరః ఏవ చ ద్వౌ ఇమౌ పురుషౌ (స్తః) | సర్వాణి భూతాని క్షరః (ఉచ్యతే)| కూటస్థః అక్షరః ఉచ్యతే||

||శ్లోకార్థములు||

లోకే క్షరః చ - లోకములో క్షరుడు అని
అక్షరః ఏవ చ - అక్షరుడు అని
ద్వౌ ఇమౌ పురుషౌ - ఇద్దరు ఈ పురుషులు కలరు
సర్వాణి భూతాని క్షరః (ఉచ్యతే)- సమస్త భూతములు క్షరులు అని చెప్పబడుచున్నారు
కూటస్థః అక్షరః ఉచ్యతే- కూటస్థుడగు జీవుడు అక్షరుడు అను చెప్పబడుచున్నాడు.

|| శ్లోకతాత్పర్యములు||

"లోకములో క్షరుడు అని అక్షరుడు అని ఇద్దరు ఈ పురుషులు కలరు.
సమస్త భూతములు క్షరులు అని చెప్పబడుచున్నారు. కూటస్థుడగు జీవుడు అక్షరుడు అను చెప్పబడుచున్నాడు".||16||

ఇక్కడ ఇద్దరు పురుషులు చెప్పబడిరి. క్షర అక్షర పురుషులు. క్లుప్తముగా దేహాభిమాని క్షరుడు అని. అత్మాభిమాని అక్షరుడు అని. అత్మాభిమాని అంటే ఆత్మ దేహములలో భేదము తెలిసినవాడు. ఆత్మపై అభిమానము కలవాడు. కాని ఆత్మానుభవము కలవాడు అని కాదు.
మనస్సే తాము అని గ్రహించి మోక్షము వచ్చే దాకా అనేక జన్మలవరకు నశించని జీవుడు అక్షరపురుషుడు. అనేక జన్మలవరకు నశించని వాడగుటచే ఆ జీవుని కూటస్థుడగు, జీవుడు అలాగే అక్షర పురుషుడు అని అంటారు.

అక్షరుడు త్రిగుణాతీతుడు కాదు. ఆక్షరుడు అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ యోగములో చెప్పబడిన క్షేత్రజ్ఞుడు కూడా కాడు. క్షేత్రజ్ఞుడు కూడా ఈ రెండు పురుషులకన్న వేరే అయినవాడు. క్షేత్రజ్ఞుడే పరమాత్మ అని కృష్ణుడు చెప్పే వున్నాడు. ఇక్కడ కూడా ఆ మాటే మనము మళ్ళీ వింటాము.

|| శ్లోకము 17 ||

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః|
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః||17||

స|| యః లోకత్రయం ఆవిశ్య బిభర్తి (తత్) అవ్యయః ఈశ్వరః అన్యః ఉత్తమః పురుషః ఉదాహృతః| పరమాత్మ ఇతి (చ ) ఉదాహృతః||17||

||శ్లోకార్థములు||
యః లోకత్రయం ఆవిశ్య - ఎవరు మూడు లోకములలో ప్రవేశించి
బిభర్తి- భరించుచున్నాడో ( అట్టి)
అవ్యయః ఈశ్వరః - నాశనము లేని జగన్నియామకుడును
అన్యః ఉత్తమః పురుషఃఉదాహృతః- అన్యుడు ఉత్తమ పురుషుడని చెప్పబడుచున్నాడు.
పరమాత్మ ఇతి (చ ) ఉదాహృతః- పరమాత్మ అని చెప్పబడుచున్నాడు.

|| శ్లోకతాత్పర్యములు||

"ఎవరు మూడు లోకములలో ప్రవేశించి భరించుచున్నాడో ( అట్టి),
నాశనము లేని జగన్నియామకుడును, అన్యుడు ఉత్తమ పురుషుడని, పరమాత్మ అని చెప్పబడుచున్నాడు".||17||

"ఉత్తమః పురుషః అన్యః " అన్న మాటలో మనకు తెలిసిపోతుంది. ఈ క్షర అక్షర పురుషులు ఇద్దరు కన్న ఇంకొక పురుషుడు ," అన్యః" ఉత్తముడు అని. క్షరుడు దేహాభిమాని. అక్షరుడు ఆత్మాభిమాని కాని అత్మానుభవము లేనివాడు. అత్మానుభవము లేని పురుషుని కన్న అత్మానుభవము కల అంటే ఆత్మ సాక్షాత్కరము పొందిన పురుషుడు ఉత్తముడు. ఆయనే పరమాత్మ. జ్ఞానమార్గములో ఆత్మ సాక్షాత్కారమే పరాకాష్ఠ. అదే మోక్షము. ఆ మోక్షము లో ఆత్మ పరమాత్మ లో లీనము అయిపోతుంది. ఆ పరమాత్మ నిర్గుణ నిరాకార స్వరూపము.

నిర్గుణ నిరాకారమైన పరమాత్మని, సగుణాత్మకమైన పరమాత్మగా భావించినపుడు, ఆ పరబ్రహ్మము నాశనము లేని జగన్నియామకుడు. ఆ పరబ్రహ్మము, వేదములలో చెప్పినట్లు " స దధార పృథ్వీమ్", ఆయన భూమిని ధరిస్తాడు. ఆయనే మూడు లోకములని భరించుచున్నాడు. అయనే పరమాత్మ అని చెప్పబడుచున్నడు.

క్షేత్ర క్షేత్రజ్ఞ యోగములో, 'అన్ని క్షేత్రములలోనూ వున్న క్షేత్రజ్ఞుడను నేనే", అని కృష్ణభగవానుడు చెప్పాడు. ఇక్కడ అదే క్షేత్రజ్ఞుడు, ఉత్తమ పురుషుడుగా చెప్పబడుచున్నాడు. ఆ ఉత్తమ పురుషుడే నాశనము లేని జగన్నియామకుడు. సమస్త క్షేత్రములలో ఉన్న క్షేత్రజ్ఞుడు నేనే అన్న కృష్ణ పరమాత్మ , ఇక్కడ కూడా ఆ ఉత్తమపురుషుడు నేనే అని ముందు శ్లోకములో చెపుతాడు.

|| శ్లోకము 18 ||

యస్మాత్ క్షరమతీతోఽహమ్ అక్షరాదపి చోత్తమః|
అతోఽస్మి లోకేవేదే చ ప్రథితః పురుషోత్తమః||18||

స|| యస్మాత్ అహం క్షరం అతీతః అక్షరాత్ అపి ఉత్తమః చ అతః లోకే వేదేచ పురుషోత్తమః ప్రథితః అస్మి ||18||

||శ్లోకార్థములు||

యస్మాత్ అహం - ఏ కారణమువలన నేను
క్షరం అతీతః - క్షరునికి అతీతుడని
అక్షరాత్ అపి ఉత్తమః - అక్షరునికి కన్న ఉత్తముని గా వున్నానో
అతః- ఆ కారణము వలన
లోకే వేదేచ - లోకములోను వేదములలోను
పురుషోత్తమః ప్రథితః అస్మి - పురుషోత్తమునిగా ప్రసిద్ధుడై వున్నాను.

|| శ్లోకతాత్పర్యములు||

"ఏ కారణమువలన నేను క్షరునికి అతీతుడు గను, అక్షరునికి కన్నఉత్తముని గా వున్నానో , ఆ కారణము వలన
లోకములోను వేదములలోను, పురుషోత్తమునిగా ప్రసిద్ధుడై వున్నాను".||18||

ఉత్తమపురుషుడు అంటే పురుషులలో ( క్షర అక్షర పురుషులలో) ఉత్తముడు. పురుషులలో ఉత్తముడే పురుషోత్తముడు. క్షర అక్షర పురుషులకి అతీతమైన కృష్ణ పరమాత్మయే పురుషోత్తముడు. ఇక్కడ కృష్ణుడు తనే ఆ పురుషోత్తముడు అని చెపుతున్నాడు. .

|| శ్లోకము 19 ||

యోమామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్|
స సర్వభజతి మాం సర్వభావేన భారత||19||

స|| హే భారత ! యః అసమ్మూఢః ఏవం మామ్ పురుషోత్తమమ్ జానాతి సః సర్వవిత్ సర్వభావేన మామ్ భజతి||19||

||శ్లోకార్థములు||

యః అసమ్మూఢః ఏవం - ఎవరు అజ్ఞానము లేని వాడై ఈ విధముగా
మామ్ పురుషోత్తమమ్ జానాతి - నన్ను పురుషోత్తమునిగా తెలిసికొనుచున్నాడో,
సః సర్వవిత్ - వాడు అన్నీ తెలిసినవాడగుచు.
సర్వభావేన మామ్ భజతి- సర్వవిధముల నన్ను ధ్యానించుచున్నాడు.

|| శ్లోకతాత్పర్యములు||

"ఓ భారత, ఎవరు అజ్ఞానము లేని వాడై ఈ విధముగా నన్ను పురుషోత్తమునిగా తెలిసికొనుచున్నాడో,
అట్టి వాడు అన్నీ తెలిసినవాడగుచు, సర్వవిధముల నన్ను ధ్యానించుచున్నాడు".||19||

ఈ సందేశము సంసారసముద్రమునుంచి బయట పడడానికి కోరిక గల ముముక్షులకు.అట్టివారు కృష్ణపరమాత్మనే పురుషోత్తమునిగా భావించి ధ్యానించవలెను. ఇదే పురుషోత్తమ ప్రాప్తి కి మార్గము.

ఇది కర్మయోగములో పోవు వారికి జ్ఞనయోగములో పోవు వారికి భక్తి యోగములో పోవుచున్నవారికి, ఆత్మజ్ఞానము కలవారికి, శంకరాచార్యులవారు తమ భాష్యములో చెప్పినట్లు,ఈ మాట అక్కరలేదు. ఇది సంసార్మార్గమునుంది బయటపడెవారికోసము చెప్పబడిన మాట.

|| శ్లోకము20 ||

ఇతి గుహ్యతమం శాస్త్ర మిదముక్తం మయాఽనఘ|
ఏతద్భుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్కృతకృత్యశ్చ భారత||20||

స|| హే అనఘ ! ఇతి గుహ్యతమం ఇదం శాస్త్రం మయా ఉక్తం ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ కృతకృత్యః చ స్యాత్||20||

||శ్లోకార్థములు||

ఇతి గుహ్యతమం- ఈ ప్రకారముగా అతి రహస్యమైనట్టి
ఇదం శాస్త్రం - ఈ శాస్త్రము
మయా ఉక్తం - నాచేత చెప్పబడినది.
ఏతత్ బుద్ధ్వా - దీనిని తెలిసికొని
బుద్ధిమాన్ కృతకృత్యః చ స్యాత్- బుద్ధిమంతుడు కృతకృత్యుడు అగుచున్నాడు

|| శ్లోకతాత్పర్యములు||

"ఓ అనఘా, ఈ ప్రకారముగా అతి రహస్యమైనట్టి ఈ శాస్త్రము నాచేత చెప్పబడినది.
దీనిని తెలిసికొని బుద్ధిమంతుడు కృతకృత్యుడు అగుచున్నాడు".||20||

కృష్ణభగవానుడు అర్జునిని "అనఘా" అంటే పాపరహితుడా లేక పాపములు లేనివాడా అని సంబోధిస్తూ, అతిరహస్యమైన ఈశాస్త్రము నీకు చెప్పాను అంటాడు. ఇది రహస్యమా ? ఎందుకు రహస్యము అనిపించవచ్చు. నాలుగవ అధ్యాయములో కర్మ యోగము పుట్టు పూర్వోత్తరాలు చెపుతూ -"స కాలేనేహ మహతా యోగో నష్ఠః పరంతప' (4.02)- అంటే 'చాలా కాలము గడిచినందున ఈ యోగము ఈ లోకములో ( నష్ఠః) పోయినది' అని చెపుతాడు. అంటే ఆ గీతోపదేశ కాలములో ఈ గీతలో చెప్పిన విషయాలు అన్నీ ఎవరికీ తెలియని రహస్యములు లాగా ఉండి పోయాయి అన్నమాట. ఈ రహస్యమైన ఈ పురుషోత్తముని గురించి తెలిసికొనినవాడు జ్ఞానము సంపాదించినవాడు కృత కృత్యుడు కాగలడు అని కృష్ణుని సందేశము.

భగవానుడు బోధించిన ఈ అధ్యాత్మశాస్త్రము ఆచరించినవాడు ధన్యుడగును.

పురుషోత్తమప్రాప్తియోగము సమాప్తము

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ
పంచదశోధ్యాయః
ఓం తత్ సత్

|| om tat sat||